RTA | సిటీబ్యూరో, మే 23 ( నమస్తే తెలంగాణ) : డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు పొందాలంటే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. 20 నుంచి రెండు నెలల సమయం కూడా ఆలస్యమవుతుండటంతో ఏజెంట్లను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయంలో ప్రకాశ్ అనే వాహనదారుడు తన ఆర్సీ 20 రోజులైన రాకపోవడంతో ఒక ఏజెంట్‌ను ఆశ్రయించి రెండే రోజుల్లో ఆర్సీ పొందినట్టు తెలిపాడు. ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల బెడద లేకుండా చేయాలని ఆర్టీఏ ఉన్నతాధికారులు అన్నీ ఆర్టీఓ కార్యాలయాల్లో ఏఐ కెమెరాలతో నిఘా పెట్టాలని భావించారు.
ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ కెమెరాలు అన్నీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్టీఏ కార్యాలయాలన్నీ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఇబ్రహీంపట్నం ఆర్టీఏలో స్మార్ట్‌కార్డుల కొరత ఉండటంతో ఏజెంట్లు ఇదే అవకాశంగా మలుచుకుంటున్నారు. వెంటనే ఆర్సీ, లైసెన్స్‌లు ఇప్పిస్తామని ఆర్సీకి వెయ్యి, లైసెన్స్‌కు రూ. 1500.. ఇలా రేట్లు ఫిక్స్ చేసి ఏజెంట్లే సేవలందిస్తున్నారు.