సిటీబ్యూరో: నగర రోడ్లపై దూసుకువెళ్లే వాహనదారులు జర జాగ్రత్త.. రహదారులపై నిర్దేశిత వేగ పరిమితిలో వాహనాన్ని నడపకుంటే భారీ జరిమానాలు తప్పవు. గ్రేటర్లో వేగ నియంత్రణను పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రధానంగా కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) కింద నిర్వహణ చేపడుతున్న ప్రధాన రోడ్లపై వేగ నియంత్రణ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. కార్లకు కిలోమీటర్ పర్ అవర్ (కెఎంపీహెచ్) 60 వేగం, బస్సులు, ద్విచక్ర వాహనాలు, లారీలు, ఇతర వాహనాలు 50 స్పీడ్ లిమిట్లో వెళ్లాలని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా వేగ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, స్పీడ్ లిమిట్ దాటి వెళితే.. సీసీ కెమెరాల ద్వారా సదరు వాహనదారుడిని గుర్తించి జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు.