ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సీఎం జగన్ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి రాజధాని లేని రాజ్యాన్ని ఏలుతున్నాడని, ఆయన పాలన దుర్మార్గంగా ఉందన్నారు. 2021లో స్కిల్ డెవలప్మెంట్ పై కేసు అయితే ఆ కేసుల్లో అందరూ బెయిల్పై విడుదలయ్యారని, కాని ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్టు చేశారని విమర్శించారు. అభివృద్ధి కోసం రూ.7వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు రూ.370 కోట్ల కోసం కుంభకోణం చేస్తాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రతికారమేనన్నారు. త్వరలోనే రాజమండ్రికి వెళ్లి చంద్రబాబును కలుస్తానని, వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన దీక్ష చేపడుతానన్నారు. దళితులు ఎదురు తిరగకముందే చంద్రబాబుకు జగన్ క్షమాపణ చెప్పాలని, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.