మెహిదీపట్నం, సెప్టెంబర్ 4: కూతురు ఇంజినీరింగ్ చదువు కోసం ఓ తల్లి దొంగతనానికి పాల్పడింది.. చివరికి పోలీసులకు పట్టుబడింది. టోలిచౌకి పోలీస్ స్టేషన్లో గురువారం మీడియా సమావేశంలో ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్, అదనపు ఇన్స్పెక్టర్ బాల్‌రాజ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. టోలిచౌకి మెరాజ్ కాలనీలో నివసించే షఫీ అలీఖాన్ ఇంట్లో నిజాం కాలనీలో ఉండే సబీహ బేగం(36) 25 ఏండ్లుగా పని మనిషిగా చేస్తున్నది.
ఆమె కూతురుకు ఇటీవల ఇంజినీరింగ్ కాలేజ్‌లో సీటు వచ్చింది. అయితే ఫీజు కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో సబీహ బేగం తాను పనిచేస్తున్న ఇంట్లో గత నెల 19న దొంగతనానికి పాల్పడింది. ఆగస్టు 20న షఫీ అలీఖాన్ తన ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు టోలిచౌకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పని మనిషి వ్యవహారంపై అనుమానం వచ్చింది. ఆమె కదలికలపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం టోలిచౌకిలోని ఓం జువ్వెల్లర్స్ దుకాణానికి వచ్చిన ఓ మహిళ అనుమానాస్పదంగా ఉందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అదనపు ఇన్స్పెక్టర్ బాల్‌రాజ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి సబీహ బేగంను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, తాను దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె నుంచి చోరీ చేసిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.