సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 16 : దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీఠ వేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. ఈ మేరకు గురువారం కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ కళాశాల ఆవరణలో ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్, సుశేన హెల్త్ ఫౌండేషన్, కళాశాల ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ విభాగాల సంయుక్తాధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ‘ధాత్రి మొబైల్ తల్లి పాల నిధి’ వాహనాన్ని స్మార్ట్ శంకర్ ఫేమ్ సినీ నటి నభా నటేశ్, ఎన్సీసీ సంస్థ ఎండీ అల్లూరి వెంకట రంగరాజు, సంస్థ డైరెక్టర్ సుబ్బరాజు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత, సుశేన హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, కార్యదర్శి డాక్టర్ సంతోశ్కుమార్లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం కరుణ మాట్లాడుతూ 2017లో వైద్యుల సహకారంతో నిలోఫర్ దవాఖానలో ధాత్రి మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే కేవలం దవాఖానలోనే కాకుండా పిల్లలందరికీ తల్లిపాలు అందించాలనే ఉద్దేశంలో ఈ వాహనాన్ని మొదటిసారిగా హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటి నభా నటేశ్ మాట్లాడుతూ తల్లి పాలే ముద్దని.. డబ్బా పాలు వద్దని అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ ముర్కి మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో హైదరాబాద్, విశాఖ పట్నం, కాకినాడ, ఢిల్లీ నగరాల్లో ఈ మొబైల్ వాహనాలను ప్రారంభిస్తున్నామని ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచే శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత, డాక్టర్ ఎం.దుర్గాప్రసాద్, డాక్టర్ భవానీ, ఎన్సీసీ విద్యార్థిణులు తదితరులు పాల్గొన్నారు.