దుండిగల్, జూలై 6: దంపతుల మధ్య నెలకొన్న చిన్నచిన్న తగాదాల నేపథ్యంలో ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం సర్కిల్, సూరారం డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న పి.సురేశ్, ఉమాదేవి(34) దంపతులు. వీరికి కుమార్తె రిషిక, కొడుకు కార్తికేయ ఉన్నారు.
సురేశ్ స్థానికంగా ఉన్న సబ్‌స్టేషన్‌లో లైన్‌మన్‌గా పనిచేస్తుండగా.. ఉమాదేవి గృహిణి. గత కొన్నిరోజులుగా దంపతుల మధ్య తరచూ చిన్న విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీన (శనివారం) ఉదయం కూడా యధావిధిగా సురేశ్ విధుల్లోకి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లంచ్ కోసం సురేశ్ తన భార్య ఉమాదేవికి ఫోన్ చేయగా.. ఎంతకు స్పందించలేదు.
దీంతో ఇంటికి వచ్చిన ఆయనకు తలుపులు వేసి ఉండటంతోపాటు భార్య కనిపించకపోవడంతో ఆందోళన గురయ్యాడు. పరిశీలించగా.. సెల్‌ఫోన్ బెడ్‌పై పెట్టి ఉమాదేవి బయటకు వెళ్లిపోయినట్లు గుర్తించాడు. ఫోన్‌ను పరిశీలించగా.. వారి కొడుకు కార్తికేయను తీసుకుని బౌరంపేటలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు రిషిక వద్దకు వెళ్లి ఆమెను వెంటబెట్టుకుని వెహికల్ బుక్ చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన సురేశ్ సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.