సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మన నిర్లక్ష్యమే మనల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలాలు, మూసీ, చెరువులు… ఇలా పలు ప్రదేశాల్లో ఉండే క్యూలెక్స్ దోమలతో పెద్ద ప్రమాదం లేదుగానీ.. మనం నిర్లక్ష్యంతో ఇండ్లలో నీటి నిల్వకు అవకాశం కల్పించడం వల్ల పెరిగే డెంగీ కారక దోమలతోనే ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రమ్ములు… కొబ్బరిబొండాం… ఫ్లవర్ వాజ్… వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు.. ఇలా ఒకటీ అరా కాదు.. ఏకంగా మన ఇంట్లోనే 25 చోట్ల నీటి నిల్వకు అవకాశం ఉందంటున్నారు.
మనం నిర్లక్ష్యం వహిస్తే మన ఇండ్లలో 25 చోట్ల దోమలు ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశమిచ్చినట్లే. ఒక చెంచా నీటి నిల్వలో దోమలు ఏకంగా 150-200 వరకు గుడ్లు పెడుతాయి. అందుకే ఇండ్లలోనే కాదు.. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా మన చుట్టూ దోమల ఆవాసాలు ఏర్పడకుండా వారానికోసారైనా ‘డ్రైడే’ను చేపట్టాలని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 25 లక్షల గృహాలు ఉన్నాయి. గ్రేటర్ ఎంటమాలజిస్టు విభాగం ఇంటింటి సర్వే నిర్వహించి.. దోమల ఆవాసాలకు నిర్లక్ష్యమే ఎలా కారణమవుతుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 18 లక్షల గృహాల్లో సర్వే పూర్తయిందని చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు తెలిపారు.
ముందుగా గృహాల్లో నీటి నిల్వ ఎక్కడ ఉందో గుర్తించి, అందులో దోమల లార్వా ఏ స్థాయిలో ఉందో వాటిని యజమానులకు చూపిస్తున్నారు. తీవ్రతను బట్టి యాంటీ లార్వా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను గ్రేటర్‌వ్యాప్తంగా 642 బృందాలు క్షేత్రస్థాయిలో (పిన్‌పాయింట్ ప్రోగ్రాం) పని చేస్తున్నాయి. గుర్తించిన హాట్ స్పాట్లలో చర్యలు చేపట్టేందుకు 18 యాంటీ లార్వల్ ఆపరేషన్ బృందాలు కూడా పని చేస్తున్నాయి.
డెంగీ కారక దోమ (ఎడిస్ ఈజిప్టీ) గుర్తించినట్లయితే వాటి ప్రభావం చుట్టూ అర కిలోమీటరు వరకు ఉంటుంది. దోమ అర కిలోమీటరు దూరంలో ప్రయాణించి మరొకరిని కుట్టే అవకాశం ఉంది. అంటే ఒక ఇంటి యజమాని నిర్లక్ష్యం చుట్టూ ఉన్న సుమారు 40-50 గృహాల్లోని వారిపై పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంట్లో ఎక్కడా నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..
సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నమోదవుతున్న డెంగీ కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేసు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వేతో పాటు సీరం సేకరణ వంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. అంతే కాకుండా దోమల సర్వేకూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. 3 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి అక్కడ ఫీవర్ సర్వే, వైద్య శిబిరాలు, అనుమానితుల నుంచి రక్తనమూనాల సేకరణతో పాటు జీహెచ్ఎంతో కలిసి ఫాగింగ్, స్ప్రే తదితర దోమల నివారణ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జె.వెంకటి తెలిపారు. హైదరాబాద్‌లో జనవరి నుంచి ఆగస్టు 17 వరకు 294డెంగ్యూ కేసులు, 20మలేరియా కేసులు నమోదైనట్లు.. ఇలా 3 కంటే ఎక్కువ కేసులు నమోదైన 30 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించామన్నారు.
డెంగ్యూ, మలేరియాను ముందస్తుగానే అంచనా వేసే క్రమంలో నగరంలో పలు చోట్ల దోమలను పట్టుకొని వరంగల్‌లో ఉన్న ప్రత్యేక ల్యాబ్‌కు తరలిస్తున్నారు. ఎడిసిన్ దోమలో ప్యారసైట్ ఉంటే డెంగ్యూ వస్తుందని, క్యూలెక్స్ దోమలో ప్యారసైట్ ఉంటే దాని వల్ల పైలేరియా వస్తుందని గుర్తించారు.