సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి 8గంటల వరకు గచ్చిబౌలిలో అత్యధికంగా 4.30, బీహెచ్ఈఎల్లో 3.90 , చందానగర్, ఫిల్మ్‌నగర్, షేక్‌పేటలో 3.65, హెచ్‌సీయూ, ఆసిఫ్‌నగర్, విజయనగర్‌కాలనీ, నాంపల్లి ప్రాంతాల్లో 3.25, పటాన్చెరు, చార్మినార్ సర్దార్ మహల్, హయత్‌నగర్‌లో 3.0, లింగంపల్లి, ఆర్సీపురం,
ఖాజాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో 2.93, పాతబస్తీలోని చందూలాల్ బారాదరి, బేగంబజార్, హస్తినాపురం ప్రాంతాల్లో 2.70 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా, నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 30.8, కనిష్ఠం 22.9 డిగ్రీలు, గాలిలో తేమ 84శాతంగా నమోదైనట్లు అధికారులు వివరించారు.