సిటీబ్యూరో: ‘ఈ చిన్నారులతో గడపడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ మ్యాచ్‌లో కొన్ని సార్లు బాల్‌ను క్యాచ్ పట్టడం మిస్సైనప్పుడు మ్యాచ్‌కు నష్టం కలుగుతుంది. అదే క్రమంలో జీవితంలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, భావోద్వేగాలు సమతుల్యతను కోల్పోవడం వల్ల క్యాన్సర్‌పై చేసే పోరాటం సన్నగిల్లే ప్రమాదం ఉంటుందని’ అని ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అన్నారు.
శుక్రవారం బంజారాహిల్స్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను ఆయన సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధిత చిన్నారులను పలకరించారు. దాదాపు గంటన్నరకు పైగా చిన్నారులతో గడిపిన సిరాజ్.. వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రులు మనోధైర్యంతో ఉండాలన్నారు. క్యాన్సర్ బాధిత చిన్నారులకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు.