AK Singh | సైదాబాద్ : వర్షాధారిత వ్యవసాయంలో అధునీకరణ అంశాలను అన్వేషించాలని బీహర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డాక్టర్ ఏకే సింగ్ అన్నారు. సంతోష్‌నగర్‌లోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన కేంద్రం (క్రీడా), ఇండియన్ సొసైటీ ఆఫ్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (ఐసీఏఆర్) సంయుక్తంగా నిర్వహించిన ‘వర్షాధారిత వ్యవసాయం – స్థితిస్థాపకత స్థీరమైన జీవనోపాధికి మార్గాలను నిర్మించడం’ అనే అంశంపై మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రెండో అంతర్జాయ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సదస్సుకు వివిధ దేశాలకు, రాష్ట్రాలకు చెందిన 750 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్ధులు, అగ్రి కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీహర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డాక్టర్ ఏకే సింగ్ మాట్లాడుతూ మొట్ట వ్యవసాయంలో అధునిక వంగడాలను సృష్టించడంలో క్రీడా చేస్తున్న పరిశోధనలను ఆయన అభినందించారు.
శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా స్థితిస్థాపకతను తగ్గించడం సాధ్యమన్నారు. నీటి సంరక్షణకు, వర్షాధారిత వ్యవసాయంలో అధునీకరణ అంశాలను అన్వేషించాల్సిన అనేక అంశాలపై చర్చలు జరగడం శుభప్రదమన్నారు. డాక్టర్ జేఎస్ సామ్రా, క్రీడా డైరెక్టర్ డాక్టర్ వీకే సింగ్ మాట్లాడుతూ నీటి వనరుల సేకరణ, నీటి పొదుపు సద్వినియోగం, నేల సంరక్షణకు అనుగుణంగా వాతావరణాన్ని తట్టుకునే పంటలు, వాటి పద్ధతులపై చర్చించామన్నారు. అదే విధంగా రైతాంగం నష్టపోకుండా పంటల బీమా, పంటల అధిక దిగుబడి, రైతుల జీవనోపాధితోనే వ్యవసాయ రంగం మరింతగా అభివృద్ధికిలోకి వస్తుందన్నారు. వ్యవసాయంలో వర్షాధారిత పంటల వ్యవస్థల కోసం పరిపరక్షణ, ఎరువుల వినియోగం తగ్గించడంపై రెండు ప్యానెల్ చర్చలు జరిగాయన్నారు. దీంతోపాటు కొన్ని విస్తృత సిఫారసులను వెల్లడించడంతో వాటిపై అవగాహన కల్పించామన్నారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జెవీఎన్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.