సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం సికింద్రాబాద్‌లో ఆయా శాఖలతో కలిసి మాక్‌డ్రిల్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వర్షాకాలంలో విపత్తుల నిర్వాహణకు అన్ని శాఖలు సమయాత్తవుతున్నాయని ఆయన తెలిపారు.
ఇందులో భాగగానే టీజీఐసీసీసీ ఆయా విభాగాలు ట్రైపోలీస్ కమిషనరేట్ లాఅండ్‌అర్డర్, ట్రాఫిక్ పోలీస్, అగ్నిమాపక శాఖ, విపత్తుల నిర్వాహణ విభాగం, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండబ్ల్యూస్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్డీఎంఏ, ఐఅండ్‌పీఆర్, టీజీఎస్పీడీసీఎల్, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ విభాగాలు మాక్‌డ్రిల్‌లో పాల్గొన్నాయి. అనుకోని పరిస్థితులలో భవనం కూలిపోయినప్పుడు.. అన్ని శాఖలు సమన్వయంతో ఎలా పనిచేస్తాయనే అంశంపై ఈ మాక్‌డ్రిల్ నిర్వహించారు.
సికింద్రాబాద్‌లోని మోర్ లైబ్రరీ వద్ద..
సికింద్రాబాద్‌లోని ఎన్ మోర్ లైబ్రరీ అండ్ యాక్టివిటీ సెంటర్ వద్ద బిల్డింగ్ కూలిపోయిందని, ఇద్దరు మృతి చెందారని, 15 మంది వరకు గాయపడ్డారంటూ డయల్ 112(నేషనల్ హెల్ప్‌లైన్ నెంబర్)కు ఫోన్ రావడంతో టీజీఐసీసీ కంట్రోల్ రూమ్ నుంచి ఈ సమాచారాన్ని అన్ని విభాగాల కంట్రోల్ రూమ్‌లకు సమాచారం ఇచ్చి, 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో పోలీసులు, అంబులెన్స్ వాహనాలు చేరుకున్నాయి, అక్కడ రెస్క్యూ అపరేషన్‌కు ఏర్పాట్లు చేపట్టి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించారు.
అత్యవసర సర్వీస్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు, ఇంతలోనే 20 నుంచి 30 నిమిషాల మధ్యలో డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, విద్యుత్, వాటర్ అన్ని విభాగాల అధికారులు అక్కడ చేరుకొని మాక్‌డ్రిల్‌లో పాల్గొన్ని రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ మాక్‌డ్రిల్‌ను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తూ అక్కడి సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ వేగంగా సహాయక చర్యలు జరిగే విధంగా చూశామని డైరెక్టర్ వెల్లడించారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.