దుండిగల్, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ డైలాగ్-2026 పోటీలకు దుండిగల్ సర్కిల్ పరిధిలోని మర్రిలక్ష్మన్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల(ఎంఎల్ఆర్ఐటీ)కు చెందిన విద్యార్థ్ధి ఎంపికైనట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మూడవ సంవత్సరం చదువుతూ.. జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ ఈ పోటీలకు ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణంగా ఉందని కళాశాల చైర్మన్, వెటరన్ అథ్లెట్ మర్రి లక్ష్మన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డా.కే,శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ నాయిని ఉదయరంజన్ గౌడ్‌తో కలిసి విప్లవను కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్కరించారు.
ఎమ్మెల్యే మర్రి అభినందన..
కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాలుగుదశల్లో జరిగిన క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రెజెంటేషన్, ఇంటర్వూ వంటి విభాగాలల్లో జరిగిన పోటీలల్లో దేశవ్యాప్తంగా సుమారు 50లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా తమ కళాశాలకు చెందిన విద్యార్థ్ధి విప్లవ ఎంపికవడం అభినందనీయమన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి 12వ తారీకు వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2026 పోటీల్లో పాల్గొని ‘సైస్టెనబులిటీ, గ్రీన్ వికసిత్ భారత్’ అనే అంశంపై మాట్లాడనున్న విప్లవ అందులోనూ రాణించాలని రాజశేఖర్‌రెడ్డి అభిలషించారు. ఈ సందర్భంగా విప్లవతో పాటు కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ నాయిని ఉదయరంజన్ గౌడ్‌ను అభినందించారు.