
టీఆర్ఎస్తోనే అభివృద్ధి,సంక్షేమంటూ జైకొట్టారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయదుందుభి మోగించారు. ఏడు రౌండ్లలో లెక్కింపు జరగగా, తొలి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తూ కమలం అభ్యర్థిని గుక్కతిప్పుకోకుండా చేశారు. మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ఒకటి,రెండు ప్రాధాన్యతలు కలిపి ఏకంగా 56.17 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు. తెలుగుఖ్యాతిని జాతీయ పార్టీలు పట్టించుకోకున్నా సీఎం కేసీఆర్ స్వయంగా పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా, విద్యావేత్త, సౌమ్యురాలైన ఆయన కూతురు వాణీదేవికి టికెట్ ఇవ్వడంతో అన్నివర్గాలు హర్షించాయి. 1,94,944 మహిళా ఓట్లలో 63% పోలవడం కూడా ఆమె గెలుపునకు సంకేతమైంది. పెట్రోల్, సిలిండర్‌కు మొక్కి ఓటేసిన ప్రచారం కూడా ప్రభావితం చేసింది. వాణీదేవి గెలుపుతో శనివారం గ్రేటర్‌వ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి.
పులి ఒక్క అడుగు వెనుకంజ వేసిందంటే …దాని సంకేతం ఓటమి అని కాదు…మరో రెండు అడుగులు ముందుకు దూకి..ఉగ్రరూపం చూపించడానికే…ఇదీ టీఆర్ఎస్ పార్టీ విషయంలో అక్షరాల నిరూపితమైనది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయిందని ప్రతిపక్షాలు చేసిన విష ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ఉద్యోగాల కల్పనలో ప్రజాక్షేత్రంలో సాక్ష్యాధారాలను ప్రజలు ముందు ఉంచడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను అందంగా చెబుతూ.. పబ్బం గడిపే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పింది. ఆనతికాలంలోనే వచ్చిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కోటాపై సగర్వంగా గులాబీ జెండాను ఎగురవేసింది. అంతేకాదు బీజేపీ సిట్టింగ్ కోటాపై పాగా వేసి తమ సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది.
ఎన్రోల్ నుంచి గెలుపు వరకు…
వాణీదేవి విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నుంచి క్షేత్రస్థాయి క్యాడర్ వరకు సమష్టిగా పనిచేశారు. ముందుగా ఓటరుగా ఎన్రోల్ నుంచి ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురావడంలో గ్రేటర్ ప్రజాప్రతినిధులు, ఇన్చార్జిలు, శ్రేణులు, పార్టీ అభిమానులు విశేషంగా కృషి చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రులు కేటీఆర్, జిల్లా ఇన్‌చార్జీలుగా మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ నిత్యం ప్రచార సరళిని తెలుసుకుంటూ.. ఓటర్లకు చేరువయ్యారు. ప్రతి 50 ఓటర్లకు ఇన్‌చార్జీలతో పాటు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా శ్రేణులను దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు గడపను తట్టి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ వారిని పార్టీ వైపు ఆకర్షించారు .విస్తృతంగా ప్రచారం నిర్వహించి ..రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం పెంపు వరకు ఐక్యతను చాటి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించారు. అన్ని వర్గాలను ఏకం చేశారు. పార్టీ ఏకంగా రెండు లక్షల 80వేలకు పైగా ఎన్రోల్ చేయగా, వారిని పోలింగ్ కేంద్రానికి తరలించడంలో సక్సెస్ అయ్యారు. ఒక ఓటరును దాదాపు ఐదు సార్లు కలవడమే కాకుండా పోలింగ్ వరకు తీసుకువెళ్లి ఓటింగ్ శాతం పెంచడంలో కీలకంగా వ్యవహరించారు.
ప్రతిభావంతురాలికే పట్టం …
వాణీదేవి మంచి విద్యావేత్త .లెక్చరర్ ఎంతో మందికి విద్యను అందించిన గొప్ప వ్యక్తి ..ప్రశ్నించే గొంతులంటూ ఎన్నికల్లో ఎందరూ వచ్చినా పట్టభద్రులు మాత్రం టీఆర్ఎస్కే తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. ప్రగతికే పట్టం కట్టారు..మండలిలో వాణీదేవియే తమ సమస్యల పరిష్కారానికి అసలు సిసలైన గొంతుక అని తమ ఓటు ద్వారా చాటి చెప్పారు.
మా గెలుపు మంత్రం..
ఎన్నిక ఏదైనా సీఎం కేసీఆర్ ఫొటోనే మా గెలుపు మంత్రం..పట్టభద్రులు అభివృద్ధికే పట్టం కట్టారు..వాణీదేవిని ఆశీర్వదించిన పట్టభద్ర ఓటర్లకు కృతజ్ఞతలు. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపులో టీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – మంత్రి గంగుల కమలాకర్
ప్రతిపక్షాలకు చెంపపెట్టు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు చెంపపెట్టు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకంతోనే పట్టభద్రులు, ఉద్యోగులు సురభి వాణీదేవికి ఓటేసి గెలిపించారు. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
వాణీదేవికి స్వాగతం
ఎమ్మెల్సీగా వాణీదేవి గెలుపు చారిత్రాత్మకం.. తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవికి స్వాగతం.. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా తీర్పు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు . పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకుంటారు. ఈ ఫలితాలను చూసైనా ప్రతిపక్ష పార్టీలు బుద్ది తెచ్చుకోవాలి. నోటికి వచ్చినట్లు, అవమానకరంగా మాట్లాడుతున్న నోళ్లు ఇప్పటికైనా మూతపడాలి. – ఎమ్మెల్సీ, కె. నవీన్‌కుమార్
అనూహ్యంగా తెరపైకి…
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ పోటీలో ఉండదు..జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయింది..ఇక ఆ పార్టీని ప్రజలు విశ్వసించరు..ఇలా అనేక అసత్యాలు, నోటికి ఎంత వస్తే అంత ప్రతిపక్షాలు విష ప్రచారం చేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు ఊహించని విధంగా వ్యూహాలు రచించడంలో దిట్ట అయిన సీఎం కేసీఆర్.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పీవీ కూతురు, విద్యావేత్త వాణీదేవిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. తెలంగాణకు ఠీవీ అయిన పీవీని జాతీయ పార్టీలు గుర్తించకపోయినా.. శత జయంతి ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా ఆ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వాణీదేవిని తీసుకువచ్చారు. ఇక్కడే సీఎం కేసీఆర్ తన వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చారు.