బేగంపేట: ప్రశాంతంగా ఉండే నార్త్‌జోన్ పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ప్రశాంత వాతావరణం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. ఆదివారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో ముత్యాలమ్మ దేవాలయ పరిధిలోని బస్తీవాసులు, ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి వారం రోజులు కావొస్తున్నా.. ఆందోళనలు, నిరసనలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణాన్ని తలపిస్తున్నదన్నారు. ఆలయ సంప్రోక్షణకు ఏం చేయాలనే విషయాలపై మంగళవారం బస్తీ ప్రజలు, ఆలయ కమిటీ, పండితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు రూప, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.