MLA Srinivas Yadav | ప్రజల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు తలసానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలోని అమ్మవారి ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన దురదృష్టకరమంటూ విచారం వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన సమయంలో ఐదారు రోజులు ఈ ప్రాంతం మొత్తం భయానకర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని, వాటిని దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదన్నారు. ఎంతో భక్తితో కొలుచుకునే అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనతో బస్తీవాసులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. భక్తుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం తాను చర్యలు చేపట్టగా.. అదే సమయంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముందుకొచ్చిందని వివరించారు. ప్రజల సంతోషమే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇకపై ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదని, పునరావృతం కాకుండా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.