బేగంపేట, జూన్ 21: మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికింద్రాబాద్లోని ఉజ్జాయినీ మహంకాళి ఆలయ పరిసరాల్లో పర్యటించారు. కాలినడకన తిరుగుతూ ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు అంటేనే గోల్కొండ, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎంతో సందడి నెలకొంటుందన్నారు.
ఈ సంవత్సరం నిర్వహించే మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ఒక్క హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అదనపు పోలీసు సిబ్బందితో పాటు, షీటీమ్స్, మఫ్టీ పోలీసులను నియమించాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో రోడ్ల మరమ్మతులు, టాయిలెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహంకాళి ఆలయానికి ప్రతి సంవత్సరం బోనాల నిర్వహణ కోసం రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు. భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ తదితర స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు, వ్యాపారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.