హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి హాజరయ్యారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే అమ్మగా పూజలు అందుకుంటున్న ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ప్రతి ఏటా లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుండి వస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.
ఇక్కడకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం వలన అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందని తదనుగుణంగా ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అమ్మవారి కళ్యాణాన్ని ఆలయం లోపల నిర్వహించే వారని, కొందరికి మాత్రమే కళ్యాణం వీక్షించే అవకాశం ఉండేదని వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయం ముందు భారీ రేకుల షెడ్డు నిర్మించి షెడ్డు కింద కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు వివరించారు.
బుధవారం నిర్వహించే అమ్మవారి రథోత్సవం కూడా ఎలాంటి ఆంక్షలు, ఆటంకాలు లేకుండా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, ఆకుల హరికృష్ణ, నాయకులు అశోక్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, నామన సంతోష్ కుమార్, శ్రీహరి, కొలన్ భూపాల్ రెడ్డి, బాసా లక్ష్మి, లక్ష్మి, బలరాం, గోపిలాల్ చౌహాన్, వనం శ్రీనివాస్, నారాయణ రాజు, సురేందర్ తదితరులు ఉన్నారు.