హైదరాబాద్ : ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు నీటికోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
నల్లాలకు నీరు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తే నీటి కొరత ఉందని అధికారులు సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు. నల్లాలకు లేని నీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు.
ఒక్కో నీటి ట్యాంకర్ ను 4 వేల నుండి 5 వేల రూపాయల వరకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. జూన్ 5 వ తేదీలోగా గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో త్రాగునీటి సమస్యను పరిష్కరించకుంటే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR) పై దేశ వ్యాప్తంగా పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నియోజకవర్గాల వారిగా సమావేశాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సమావేశంలో అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, మోండా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు అశోక్ యాదవ్, కొండాపురం మహేష్ యాదవ్, కూతురు నర్సింహ, అరుణ్ గౌడ్, దేశపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.