ఎల్బీనగర్, నవంబర్ 3: మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదలకు బుల్డోజర్లతో అన్యాయం చేయాలని చూస్తే.. తాము బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామని స్పష్టం చేశారు.
ఆదివారం చైతన్యపురి డివిజన్ ద్వారకాపురం కాలనీలో మూసీ పరీవాహక కాలనీలు, బస్తీల ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రేవంత్ సర్కార్ తమ ఇండ్లను ఎప్పుడు కూలుస్తుందోనని పేదలు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు తాము అండగా ఉంటామని, అధికారులు మార్కింగ్‌లు వేసినా.. ఎలాంటి నష్టం జరుగనివ్వమని, ‘మీ ఇంటికి నేను భరోసా ఇస్తున్నా’నని సుధీర్‌రెడ్డి మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పారు. మాజీ కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.