సికింద్రాబాద్, అక్టోబర్ 23 : తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబరు 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేసి సత్తా చాటాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పిలుపునిచ్చారు. శనివారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో ఎమ్మెల్యే సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో సోమవారం జరగనున్న పార్టీ ప్లీనరీతో పాటు వచ్చే 15న వరంగల్లో జరుగనున్న సభకు సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి బస్తీ, వార్డు నుంచి నాయకులు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలివచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విజయగర్జన సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వార్డులకు బస్సులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏడేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్న నేపథ్యంలో, అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షాల మాదిరిగా అనవసరంగా విమర్శలు చేసి తమ స్థాయి తగ్గించుకునేందుకు సిద్ధంగా లేమని, విమర్శలకు గూబ గుయ్మనేలా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న వరంగల్లో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై నేతలకు వివరించారు. ఉత్సవాలకు నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుంచి కార్యకర్తలు హాజరయ్యేలా నేతలు దృషి సారించాలన్నారు.
బోర్డు మాజీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, ప్రభాకర్, నళినికిరణ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, డైరెక్టర్లు దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, నేతలు నివేదిత, పనస సంతోష్, ముప్పిడి మధుకర్, తేజ్పాల్, మురళీయాదవ్, సదానంద్గౌడ్, కుమార్ ముదిరాజ్, లతామహేందర్, సాయికిరణ్, పిట్ల నగేశ్, భాస్కర్ పాల్గొన్నారు.