సికింద్రాబాద్, సెప్టెంబర్ 29: టీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సంస్థాగత నిర్మాణం సంపూర్ణమైంది. పార్టీ ఇచ్చిన షెడ్యూల్డ్ ప్రకారమే కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా బూత్, బస్తీ, వార్డు, డివిజన్‌తో పాటు అనుబంధ సంఘాల కమిటీలు పూర్తయ్యాయి. అక్కడక్కడా మిగిలి ఉన్న కార్యవర్గాల ఎన్నికను అధినేత కేసీఆర్ తాజా ఆదేశాల మేరకు బుధవారం ముగించారు.
నియోజకవర్గం అంతటా ఆయా కమిటీల్లో అవకాశం కోసం క్యాడర్ మధ్య పోటాపోటీ నెలకొన్నా చివరకు అందరి ఆమోదంతోనే ఏకగ్రీవంగా పూర్తవడం విశేషం. కమిటీలు సజావుగా ముగియడంలో ఎమ్మెల్యే సాయన్న తన రాజకీయ చాణక్యాన్ని మరోసారి ప్రదర్శించారు. కమిటీల్లో సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులతో పాటు పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించారు.
క్షేత్రస్థాయి నుంచి చేపట్టిన సంస్థాగత నిర్మాణంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది. బూత్‌స్థాయి, బస్తీ, వార్డు కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కార్యవర్గాలతో ఈ నెలారంభం నుంచే పార్టీలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ నియోజకవర్గం ఇన్‌చార్జ్జిగా వ్యవహరించారు. ఎమ్మెల్యే సాయన్నతో కలిసి కార్యవర్గం ఎన్నికల్లో నేతలను, క్యాడర్‌ను సమన్వయపరిచా రు. పార్టీ సూచించిన విధం గా 51శాతం బడుగు, బలహీన ప్రాధాన్యం కల్పిస్తూనే చురుకుగా పనిచేసే వారికే పట్టం కట్టారు.
కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, ఇతర ముఖ్యుల సమన్వయంతో పార్టీ సంస్థాగత నిర్మాణం కంటోన్మెంట్లో సజావుగా ముగిసింది. పోలింగ్ బూత్, బస్తీ, వార్డు, అనుబంధ సంఘాల కమిటీల్లో స్థానం కోసం ఆరోగ్యకరమైన పోటీ కనబడింది. ఇది పార్టీ భవిష్యత్‌కు మంచి పరిణామమే. పార్టీ కోసం పనిచేస్తామని పోటాపోటీగా ముందుకు రావడం పార్టీ పట్ల ఉన్న తపనకు నిదర్శనం. బూత్‌స్థాయి కమిటీల్లో యువతకు, వార్డు కమిటీల్లో అనుభవానికి ప్రాధాన్యమిచ్చారు. అందరి అభిప్రాయాలకు విలువనిస్తూనే ఏకాభిప్రాయంతోనే కమిటీలు పూర్తికావడం సంతోషకరం. – జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్