సికింద్రాబాద్, సెప్టెంబర్ 18: పొద్దంతా కష్టపడి కూలి నాలి చేసుకునే పేదవారి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తున్నది. బడుగుల చిరకాల వాంఛ ను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రసూల్‌పురా సిల్వర్ కంపౌండ్‌లో 168 ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కాగా, మరో 56 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. సిల్వర్ కంపౌండ్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తవడంతో త్వరలోనే లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే డబుల్ ఇండ్ల ప్రారంభించే అంశంపై కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జీహెచ్ఎంసీ హౌజింగ్ విభాగం ఈఈ, ఏఈ అధికారులు ఎమ్మెల్యే సాయన్నతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
పూర్తైన ఇండ్లను లబ్ధిదారులకు అందించే విషయంపై సమాలోచనలు చేశారు. సిల్వర్ కంపౌండ్‌లో చిన్న చిన్న మరమ్మతులు మినహాయిస్తే ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారు లు ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకొచ్చారు. సాయన్న మాట్లాడుతూ బస్తీల్లో ఇళ్లు లేని నిరుపేదలకు సొం తింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఇప్పటికే డబుల్ ఇండ్లకు సంబంధించి అధికారులు అర్హులను గుర్తించి నివేదికలు సిద్ధం చేశారని చెప్పారు. ఈ నెల 23వ తేదీన సిల్వర్ కంపౌండ్‌లోని డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. తొలి దశ లో భాగంగా 168 ఇండ్లను అందజేయనున్నామని, మరో 56 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు.