బడంగ్‌పేట, సెప్టెంబర్ 20: చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా శుద్ధిచేసి పంపించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆనాడు ఎస్టీపీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తే.. ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎస్టీపీల ఏర్పాటుకు నిధులు విడుదల చేయడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35 డివిజన్లోని లెనిన్‌నగర్, మురళీ కృష్ణా నగర్లో శనివారం ఎమ్మెల్యే పర్యటించారు.
కాలనీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికంగా వీధుల్లో మురుగు పారడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సబితారెడ్డి.. అధికారుల తీరుపై మండిపడ్డారు. మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయక పోవడంతో సమస్య అలాగే మురుగు నీరు.. తాగేనీటిలో కలుస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. బోరు వాటర్ కూడ కలుషితం అవుతుందని తెలిపారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం
లెనిన్ నగర్, చింత కుంట, మరళీ కృష్ణ నగర్లో నెలల తరబడి మురుగు రోడ్ల పై పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మురళీ కృష్ణనగర్ కాలనీలో ఉన్న కమ్యూనిటీహాల్ పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పరిసరాలు మురుగుతో నిండిపోవడంతో కమ్యూనిటీ హాల్ లోపలకి పోలేని పరిస్థితి ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మీర్పేట్ కమిషనర్, డీఈ, ఎస్ఎన్డీపీ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చెరువుల్లోకి మురుగు పోకుండా ఎస్టీపీల ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారులు జాప్యం చేయకుండా త్వరగా పనులు పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ వేణుగోపాల్, బీఆర్ఎస్ నాయకులు శ్రీను నాయక్, విజయ్ కుమార్, భూపాల్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, జలాల్పూర్ సునీతా బాల్‌రాజ్, పల్లె జంగయ్య గౌడ్, మాదరి రమేష్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.