Sabita Indra Reddy | బడంగ్‌పేట, జూన్ 10: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కన పెట్టి.. తీర్మానం చేయకుండా రూ. 12 లక్షల నిధులతో షో లైట్లు ఎలా ఏర్పాటు చేస్తారని బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి. నాలుగు రోజుల కిందటే అభివృద్ధి పనులపై సమీక్ష ఉన్నదని చెప్పినా..నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. కమిషనర్, ఇతర అధికారులు ఎందుకు పక్షపాత ధోరణిలో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. తీరు మార్చుకోక పోతే ఇబ్బంది అవుతుందన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
బడంగ్‌పేటలో ప్రధాన రహదారిపై స్తంభాలు వేయిస్తే తెలియకుండా షో లైట్లు ఏర్పాటు చేయడం పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తనకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ‘అంతా మీ సొంత ఆలోచనతో చేస్తున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల ముందే బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నదని చెప్పినా.. కమిషనర్ రఘుకుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె మండిపడ్డారు. వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా ఎస్ఎన్డీపీ నాలా పనులు పక్కన పెట్టి హైమాస్ట్ లైట్లు ఉండగా, స్తంభాలకు షో లైట్లు పెట్టమని ఎవరూ చెప్పారని ఆమె నిలదీశారు. టెండర్ లేకుండా పనులు ఎలా చేస్తారన్నారు.
రూ.12 లక్షలతో కొంత మేరకు పనులు చేసి మరో రూ.12 లక్షలు బిల్లు పెడుతారా.. అని అన్నారు. లైట్లు వేసిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్‌కు ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఎవరూ చెబితే పనులు చేశావంటూ.. ప్రశ్నించారు. వేసిన లైట్లు తీసుకొని వేరే చోట వేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఉండగా, ఎలాంటి తీర్మానాలు లేకుండా పనులు చేయడం పట్ల ఆమె మండిపడ్డారు. ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, తాము చెబితే కమిషనర్ పనులు చేయడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు ప్రభుత్వ భూములు, పార్కులు, సీలింగ్ భూములు, , వర్క్ బోర్డు భూముల్లో డోర్ నంబర్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. చాలా వరకు పనులు అసంపూర్తిగా ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా కొత్త వాటిని చేయాలని ఎందుకు అనుకుంటున్నారని, ఏ వార్డుకు ఎన్ని నిధులు కేటాయించారో పూర్తి సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే అన్నారు. టెండర్ లేకుండా పనులు చేయకూడదన్నారు. నాలా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ రఘుకుమార్, డీఈ జ్యోతి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.