మణికొండ, ఆగస్టు 31 : చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. గండిపేట చెరువు కట్టపై హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రూ.27 కోట్ల నిధులతో చేపడుతున్న సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్‌తో కలిసి పరిశీలించారు. చెరువు కట్టపై నిర్మిస్తున్న ఎంట్రన్స్ ప్లాజా, టికెట్ రూం, గార్డ్ రూం, సెంట్రల్ పెవిలియన్, ఓఏఏటీ(ఆర్ట్ పెవిలియన్), టాయిలెట్స్, కిడ్స్ ప్లేయింగ్, పార్కు నిర్మాణాల వివరాలను తెలుసుకున్నారు.
చెరువు కట్టపైకి వెళ్లి నీటిమట్టం వివరాలను జలమండలిశాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ వందేండ్లు పూర్తిచేసుకున్న గండిపేట చెరువుకు పర్యాటక శోభను తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతీసుకుంటున్నారన్నారు. ఏడేండ్ల కాలంతో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుందన్నారు. నగరవాసులకు దాహార్తి తీర్చేందుకు ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాలను సర్కారు తీసుకువచ్చి అందిస్తుందన్నారు. జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండగా మారాయన్నారు. మరో ఐదేండ్ల వరకు నీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
గండిపేట చెరువు కట్టపై చేపట్టిన సుందరీకరణ పనులు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నట్లు వివరించారు. భవిష్యత్తులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లను చెరువు చుట్టూ ఏర్పాటు చేసే దిశగా సర్కారు యోచిస్తుందన్నారు. శాతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పనులను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, హెచ్ఎండీఏ ఈఈ పద్మ, డీఈ దేవేందర్‌రెడ్డి, ఏఈ జీవన్, కౌన్సిలర్లు విజేతప్రశాంత్యాదవ్, సునీతగణేశ్కుమార్, శివారెడ్డి, ఆదిత్యారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ప్రవీణ్‌యాదవ్, నర్సింహ, ఆలయ కమిటీ చైర్మన్ రమేశ్, నాయకులు హరిశంకర్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.