బండ్లగూడ, ఆగస్టు 30 : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేవారు కచ్చితంగా అధికారుల నుంచి అనుమతి పొందాలన్నారు. వినాయక నిమజ్జనం సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చెరువు, కుంటల వద్ద ఎక్కువగానే క్రేన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొవిడ్ నింబంధనలు పాటిస్తూ ఉత్సవాలను జరుపుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు. జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఉప కమిషనర్ జగన్, కార్పొరేటర్లు, నాయకులు గణేశ్ ఉత్సవాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.