మల్కాజిగిరి, అక్టోబర్ 28: వరద ముంపు సమస్యకు బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులతో శాశ్వత పరిష్కారం లభించనున్నది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో చేపట్టిన బ్యాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని వినాయక్‌నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ల పరిధిలోని బండ చెరువు నుంచి వరదనీరు.. ఈస్ట్ ఆనంద్‌బాగ్ మీదుగా ప్రవహిస్తుంటుంది. ఇక్కడ అక్కడక్కడ నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వరద నీరు ప్రవహించడా నికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక్కడి వరద ముంపు గురించి గతంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ స్థానికంగా పర్యటించి.. వరదల వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. వెంటనే సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెంటనే ఇక్కడ 1.60కిలో మీటర్ల మేర బాక్స్ డ్రైన్ నిర్మించడాకి దాదాపు రూ.20కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం వెంటనే రూ.18.6కోట్లు మంజూరు చేసింది.
ప్రస్తుతం బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల నుంచి షిరిడీనగర్, సీఫెల్కాలనీలో పనులు జరుగుతున్నాయి. బండ చెరువు నుంచి వచ్చే వరదనీరు వేగంగా ప్రవహించడానికి డివిజన్ పరిధిలోని అనంత సరస్వతినగర్, ఎన్ఎండీసీ కాలనీ, షిరిడీ నగర్, సీఫెల్ కాలనీ మీదుగా ఉప్పరిగూడ, రాజానగర్ వరకు ప్రస్తుతం బాక్స్ డ్రైన్ నిర్మిస్తున్నారు. ఆనంద్‌బాగ్ ఆర్యూబీ నుంచి వరద నీరు మళ్లించేం దుకు మరో బాక్స్ డ్రైన్‌ను కల్యాణ్‌నగర్ వరకు చేపట్టనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాం. ప్రభుత్వం బాక్స్ డ్రైన్ నిర్మాణం కోసం రూ.18.6కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. వరద నీరు సాఫీగా వెళ్లడానికి బండ చెరువు నుంచి కిందకు ఉన్న నాలాల్లో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాం. ఈ పనులు పూర్తి అయితే వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం ఈ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. పనులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే