మల్కాజిగిరి, జనవరి 6: ప్రజల సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వికాస్ నీతి’ యాప్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ‘వికాస్ నీతి’ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలు నేరుగా తెలియజేయవచ్చన్నారు. యాప్ ద్వారా వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని యుద్ధప్రాతిపదికన పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
కొత్త టెక్నాలజీతో ప్రజల వద్దకు యాప్ ద్వారా నేరుగా వెళ్తున్నామని, ప్రజల ఇంటి వద్దే సేవలు అందించేందుకు ఇదో ప్రయత్నమని అన్నారు. త్వరలో టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో పెడతామని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు దరఖాస్తు ద్వారా సమస్యలు తెలియజేస్తున్నారని, వారికి ఇబ్బంది కాకుండా ఇంటి నుంచి నేరుగా యాప్ ద్వారా తెలపడం వల్ల వారికి సౌకర్యాంగా ఉంటుందని, సమస్యను పరిష్కరించిన తర్వాత వారికి నేరుగా యాప్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు.
రైల్వే చక్ర బంధంలో నుంచి మల్కాజిగిరి నియోజకవర్గంలోని ప్రజలకు విముక్తి కల్పించడానికి త్వరలో వాజ్పేయినగర్, గౌతంనగర్, బొల్లారం, తుర్కపల్లిల్లో ఆర్‌యూబీలను నిర్మించేందుకు ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే అన్నారు. మొదట్లో వాజ్పేయినగర్ వద్ద ఆర్యూబీని నిర్మించడానికి వేసిన ప్లాన్ వల్ల దాదాపు వందకు పైగా ఇండ్లు, అపార్టుమెంట్లకు నష్టం జరుగుతుందని గుర్తించామని అన్నారు. ఇండ్లు, అపార్టుమెంట్లకు నష్టం కాకుండా ప్లాన్‌ను మార్చడం వల్ల ఆరు ఇండ్లపై మాత్రమే ప్రభావం పడుతుందన్నారు.
నిబంధనలను తుంగలోతొక్కి అడ్డగోలుగా భవనాలు నిర్మిస్తున్నారని, అధికారుల ప్రమేయంతో జరుగుతున్నట్లు గుర్తించామని, ప్రజలకు వాస్తవాలు త్వరలో తెలుస్తాయన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.10కోట్లు మంజూరు చేశారని, వాటిని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా ఖర్చు చేయాలనడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారా అభివృద్ధి పనులు చేస్తే ఫలితాలుంటాయని, తమకు నచ్చినవారితో అభివృద్ధి పనులు చేపడితే ప్రజాధనం వృథా అవుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, సునీతా రాయు యాదవ్, శాంతిశ్రీనివాస్‌రెడ్డి, సబితాకిశోర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.