Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, నేరేడ్మెట్, డిసెంబర్ 2: ప్రజల మంచి నీటి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణిలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సికింద్రాబాద్ జీఎం వినోద్ కుమార్, మల్కాజిగిరి జీఎం సునీల్ కుమార్‌లతో సమావేశం నిర్వహించి నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. జోనల్ కార్యాలయంలో ఈస్ట్ ఆనంద్‌బాగ్ నుంచి జెడ్టీఎస్ వరకు బాక్స్ డ్రైన్ల నిర్మాంచాలని జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గౌతంనగర్ డివిజన్లోని రామాంజనేయ నగర్, అయ్యన్నగర్, జేఎల్ఎస్ నగర్, న్యూ వెంకటేశ్వర నగర్‌లకు నీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గతంలో రెండు రోజులకు ఒకసారి వచ్చేవని, ప్రస్తుతం, వారం రోజులకు ఒకసారి అది కూడా అరగంట వస్తున్నాయని అన్నారు. ఇదే విశయాన్ని ఎండీ అశోక్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చామని అన్నారు.
నిధుల కొరతతో కొత్తగా పైపులైన్లు వేయడంలేదని, అంతవరకు ఈ సమస్య కొనసాగుతున్నదని అధికారులు పేర్కొన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఇబ్బందులను ఏకరువు పెట్టారు. వరద ముంపును పరిష్కరించడానికి బాక్స్ డ్రైన్లను నిర్మించి శాశ్వతంగా పరిష్కరించాలన్నారు. గల్ఫ్ లింక్ కాలనీ, స్వర్ణాంధ్ర కాలనీ డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత యాదవ్, రాము యాదవ్ పాల్గొన్నారు.