మేడ్చల్ రూరల్, ఆగస్టు 8 : జీవితంలో ఎలాంటి లోటు లేని తాను ప్రాణమున్నంతవరకు ప్రజా సేవ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy) అన్నారు. మేడ్చల్ మండలంలోని రావల్కోల్ గ్రామంలో గంగ పుత్ర సంఘం నూతన భవనాన్ని(Ganga Putra Sangam) గురువారం ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, గ్రామ గ్రామాన రోడ్లు వేశానని తెలిపారు. రావల్కోల్ ఒకప్పుడు దుమ్ము ధూళి వెదజల్లే రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారని గుర్తు చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో గ్రామంలో సీసీ రోడ్డు వేయించి అభివృద్ది పర్చామని అన్నారు. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు ప్రజల సేవ చేస్తూనే ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజితా రాజమల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ మహేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.