బంజారాహిల్స్,సెప్టెంబర్ 20: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్దేశిత గడువులోగా పూర్తయింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో బూత్ కమిటీలను సెప్టెంబర్ 10లోగా నియమించారు. సెప్టెంబర్ 11 నుంచి డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు డివిజన్ కమిటీలతో పాటు అన్ని అనుబంధ కమిటీలను ఎన్నుకున్నారు. ముందుగా కమిటీల ఏర్పాటుకు సెప్టెంబర్ 18ని గడువుగా నిర్ణయించారు. అయితే చాలా ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటు పూర్తికాకపోవడంతో ఈనెల 30లోగా పూర్తిచేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండురోజుల క్రితం ఆదేశించారు.
అయితే ముందు ఇచ్చిన గడువులోగానే కమిటీలను పూర్తిచేయడంతో నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా అన్ని కమిటీల ఏర్పాటు జరగడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కమిటీల వివరాలను టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి పంపించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో సైతం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు పూర్తయిన విషయాన్ని గురించి ప్రస్తావించడంతో పాటు ఎమ్మెల్యే మాగంటిని ప్రశంసించారు. దీంతో నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
గతంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరికంటే ముందుగానే పూర్తిచేసి ప్రశంసలు అందుకున్నామని, టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే ఏ కార్యక్రమాన్నైనా నియోజకవర్గంలో విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. డివిజన్ కమిటీలు ,బూత్ కమిటీల ఏర్పాటులో కార్పొరేటర్లతో పాటు సీనియర్ నేతలు బాగా పనిచేశారని, వారి కృషితో నిర్దేశించిన గడువులో కమిటీల ఏర్పాటు పూర్తయిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలు మరింతగా ప్రజల్లోకి వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు.