బంజారాహిల్స్/షేక్‌పేట, ఆగస్టు 29: నియోజకవర్గం అభివృద్ధితో పాటు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. షేక్‌పేట డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ నగర్, వినోభానగర్ ప్రాంతాల్లో రూ.24 లక్షలతో చేపట్టిన సీవరేజీ పైపులైన్ పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిధులు ఖర్చు చేస్తున్నామని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను ఏడేండ్లలో పూర్తిచేశామన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండాగా పనిచేస్తోందని, కొన్ని పార్టీల నాయకులు గాలిమాటలు, రెచ్చగొట్టే ప్రకటనలతో పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసమే పనిచేస్తున్న టీఆర్ఎస్ పనితీరును గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో షేక్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్‌కుమార్, మహ్మద్, షకీల్ అహ్మద్,బాలకృష్ణ, సజ్జాద్ హుస్సేన్, అఖిల్, హైమద్,లక్ష్మణ్, మధుసూదన్, శివతో పాటు కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షేక్‌పేట డివిజన్ పరిధిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన రూ.28,03 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులతో పాటు తన సొంతడబ్బులతో బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో పేదింటి ఆడబిడ్డ పె ళ్లంటే తల్లిదండ్రుల్లో ఆందోళన ఉండేదని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడపిల్ల పెండ్లి అంటే ఆందోళన తగ్గిందన్నారు.