బంజారాహిల్స్,ఆగస్టు 25: టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలిపై రోజురోజుకు ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరును మెరుగుపర్చుకోకపోతే ఉపేక్షించేది లేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెచ్చరించారు. కొంతకాలంగా జీహెచ్ఎంసీ సర్కిల్ 19 పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరుగుతుండడంతో పాటు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వ్యవహారాలపై పలు ఆరోపణలు రావడంతో బుధవారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్తీల్లోని పేదలను టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వేధిస్తున్నారని కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే కనీస స్పంద న ఉండడం లేదని, అక్రమార్కుల వద్ద లక్షలాది రూపాయలు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడునెలలుగా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది వ్యవహారాలపై పలు ఫిర్యాదులు వస్తున్నాయని వారు పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి సహకరించే అధికారులపై కఠినచర్యలు ఉంటాయని, విధుల్లో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బస్తీల్లో చిన్న స్థలాల్లో ఇండ్లు కట్టుకునేవారిని ఇబ్బందులు పెడుతున్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా అధికారులు వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో సర్కిల్ 19 డీఎంసీ రమేశ్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, సెక్షన్ అధికారి మంజు భార్గవి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావుతో పాటు టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్, సంజీవ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగడ్డ డివిజన్లోని నేతాజీనగర్‌కు చెందిన మక్సూ ద్ హస్సేన్‌కు వైద్య చికిత్సల నిమిత్తం సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన రూ. 59వేల ఎల్వోసీ మంజూరు పత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గోపీనాథ్ బాధితుడికి అందజేశారు.కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్య క్షుడు సంజీవ, నాయకులు అజీమ్, మహ్మద్ ఖారీ, ఇక్బా ల్, రాజ్ మహ్మద్, వాహెద్, భారీ పాల్గొన్నారు.