ఎర్రగడ్డ, జూలై 8: సంపూర్ణాభివృద్ధే ధ్యేయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, అధికారులతో కలిసి పలు బస్తీల్లో పర్యటించారు. ఎమ్మెల్యే గోపీనాథ్ మాట్లాడుతూ అన్ని డివిజన్లను సమగ్రంగా అభివృద్ధి చేయటానికి కట్టుబడి ఉంటానన్నారు. మందిర్, మసీదు, చర్చిల ప్రాంగణాల్లో మొక్కలను నాటారు. బోరబండ బస్టాండ్ సమీపంలోని సాయిబాబా ఆలయం, సైట్-3లోని ఇబ్రాహీం గుల్షానీ మసీదు, సైట్-4లోని బాప్టిస్ట్ చర్చి ప్రాంగణాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, పలువురు నాయకులు పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్లోని పలు కాలనీల్లో గురువారం కార్పొరేటర్ డేరంగుల వెంకటేశ్ మొక్కలు నాటారు.
ఖైరతాబాద్: ఖైరతాబాద్ డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని జీహెచ్ఎంసీ ఖాళీ స్థలంలో కార్పొరేటర్ పి.విజయారెడ్డి, డీఈ చైతన్య, ఏఈ చరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల అజయ్, కరాటే రమేశ్, మహేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గురువారం బగ్గీఖాన బస్తీలో పర్యటించారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నారాయణగూడ జలమండలి మేనేజర్ మహేందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు జి.రామన్‌గౌడ్, జైస్వాల్, నర్సింగ్‌గౌడ్, సందీప్ పాల్గొన్నారు.
వెంగళరావునగర్: వెంగళరావునగర్ కాలనీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలించారు. వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య పర్యవేక్షణలో పనులు చేపట్టారు.
శ్రీనగర్‌కాలనీ: పార్కుల్లో వ్యర్థాలను తరలించి సుందరీకరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని కార్పొరేటర్ కవితారెడ్డి అన్నారు. అచ్యుత సొసైటీ పార్కులో వ్యర్థాలను తొలగించి, మొక్కలు నాటారు. ఏఈ ఆనంద్, అనిల్, రవి, శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.