కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 14 : కేపీహెచ్‌బీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలన్నింటినీ ఆహ్లాదకరమైన పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగిందని స్థానిక ప్రజలు ఈ పార్కులను సద్వినియోగం చేసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లోని మహిళ, చిన్నారుల పార్కును ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్కులో మహిళలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో ఏండ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక పార్కుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ పార్కులో ఓపెన్ జిమ్‌తో పాటు చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, వృద్ధులు కాసేపు కూర్చుని సేదతీరేలా గద్డెలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చుట్టూరా వాకింగ్‌ట్రాక్, ఆహ్లాదాన్నిచ్చే మొక్కలు, పచ్చని గార్డెనింగ్‌తో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ఈ పార్కు పక్కగుండా వెళ్తున్న ఓపెన్ నాలాతో వస్తున్న దుర్గంధాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటానని మహిళలకు హామీనిచ్చారు. వెంటనే సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజలు నివసించే కాలనీలో పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని స్థానిక మహిళలంతా రోజు పార్కును సందర్శించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. అలాగే చిన్నారులతో కలిసి పార్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ1, 2వ ఫేజ్లలోని అల్లూరిసీతారామరాజు గ్రౌండ్లో పార్కు పనులను ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేపీహెచ్‌బీ కాలనీ బాలాజీనగర్‌లలో ఖాళీ స్థలాలను గుర్తించి పార్కులు, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బాలాజీనగర్‌లో మహిళలు, చిన్నారులు, వృద్దుల కోసం ప్రత్యేకమైన పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అల్లూరి గ్రౌండ్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నేతలున్నారు.