కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 5 : భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ జన్మదినం సందర్భంగా మూసాపేట సర్కిల్లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణవాయువును ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే మొక్కలు నాటి సంరక్షించుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్సీ వి.మమత, ఉప కమిషనర్ కె.రవికుమార్, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మందడి శ్రీనివాస్‌రావు, ముద్దం నర్సింహయాదవ్, ఆవుల రవీందర్‌రెడ్డి, పండాల సతీశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్‌కుమార్, బాబూరావు, కాండూరి నరేంద్రాచార్య, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడుకోవాలని కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో కట్టావారి సేవా కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కట్టా నరసింగారావు, పిడికిటి గోపాల్, కొల్లా శంకర్, హన్మంతరావు, రమణ, వినోద్‌కుమార్, రామారావు, సృజన్‌తేజ, సాంబశివరావు, ఎస్ఎఫ్ఏ సూరి తదితరులు పాల్గొన్నారు.