కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 7 : కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్లో రూ.6.22 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్ పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శిరీష శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కుల అభివృద్ధి లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొంభై శాతం సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.. బాలాజీనగర్ డివిజన్లో పురాతన కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా డ్రైనేజీ పైపులైన్లను ఆధునీకరించే పనులను చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు.
బాలాజీనగర్ డివిజన్లోని రంగధాముని (ఐడీఎల్) చెరువును రూ.100 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. ఐడీఎల్ చెరువు పరిసర ప్రాంతాలను ట్యాంక్‌బండ్ తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు కూడా మంజూరవుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఐడీఎల్ చెరువు సుందరీకరణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెరువును అభివృద్ధి చేయడం వల్ల కుటుంబ సభ్యులంతా చెరువుగట్టుపై సేదతీరి ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
అదే విధంగా నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ తాగునీటి చెరువులుగా తీర్చిదిద్దడం కోసం నీటిశుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయితే చెరువులు సుందరంగా మారుతాయన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ బాబూరావు, డివిజన్ అధ్యక్షుడు దేవాది హరినాథ్, వెంకటేశ్ చౌదరి, పాతూరి గోపి, పవన్, కర్క పెంటయ్య, మున్నా, భాస్కర్, సుశీల్, అరుణ, బండి సుధ, సావిత్రి పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ : కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్లోని పలు కాలనీల్లో రూ.5.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న యూజీడీ పైపులైన్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించనున్నట్లు కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు తెలిపారు. కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్ లాస్ట్ బస్టాప్, 5వ ఫేజ్ ఓపెన్ జిమ్, 9వ ఫేజ్ సందీప్ మెడికల్ హాల్, వసంతనగర్ కమర్షియల్ కాంప్లెక్స్ పక్కన చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలందరికీ టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
మంగళవారం టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావుతో పాటు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత కేటీఆర్ సూచన మేరకు 10వ తేదీలోపు ఏరియా, బస్తీ కమిటీలు, 20వ తేదీలోపు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీల్లో పార్టీకోసం పనిచేసిన వారందరికీ గుర్తింపుఇవ్వనున్నట్లు తెలిపారు.