కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 7 : మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో చెరువులన్నీ స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని సున్నం, ముళ్ళకత్వ, మైసమ్మ, కాముని, రంగధాముని, కాజాకుంట, నల్ల చెరువుల్లో ఎస్టీపీలను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు జలమండలి, రెవెన్యూ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా నగరంలోని చెరువుల్లో మురుగునీటిని శుద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రధాన చెరువుల్లో మురగునీటిని శుద్ధి చేసేందుకు రూ.317 కోట్ల నిధులను కేటాయించిందని.. ఈ నీటి శుద్ధి కేంద్రాలు అందుబాటులోకి వస్తే చెరువుల్లో దుర్గంధం పోయి.. స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతాయన్నారు.
ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కోసం త్వరతగతిన స్థలాలను సేకరించి.. పనులను ప్రారంభించాలన్నారు. స్థలాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వాటిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. చెరువుల సుందరీకరణ, నాలాల అభివృద్ధిలో ఎక్కడా రాజీపడొద్దని.. పక్కా ప్రణాళికతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు. అత్యధికంగా చెరువులు కలిగిన కూకట్పల్లి ప్రాంతంలో ఎస్టీపీలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మురుగునీటిని శుద్ధి చేయడం వల్ల చెరువులన్నీ స్వచ్ఛమైన తాగునీటి చెరువులుగా మారుతాయని.. తద్వారా మురుగునీటిలో వృద్ధి చెందుతున్న దోమలను నియంత్రించవచ్చన్నారు. చెరువుల పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా మార్చి ఆహ్లాదాన్ని అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
కూకట్పల్లి రంగధాముని చెరువును సర్వాంగసుందరంగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ రంగధాముని చెరువును పరిశీలించి సుందరీకరణకు వెంటనే నిధులు మంజూరు చేయడంతో.. శనివారం చెరువును అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నడిబొడ్డునున్న రంగధాముని చెరువు పరిసరాలను పరిశుభ్రంగా మార్చి.. చుట్టూర ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. చెరువు నీళ్లలో బోటింగ్.. చెరువు గట్టుపై పిల్లలు.. పెద్దలు సేదతీరేలా ముస్తాబు చేయాలన్నారు. ట్యాంక్‌బండ్ తరహాలో అన్ని హంగులు ఉండేలా సుందరీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, సబీహాబేగం, పగుడాల శిరిషాబాబూరావు, జూపల్లి సత్యనారాయణ, జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.