కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 6 : కూరగాయల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను అందుబాటులోకి తేవడం హర్షణీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ రైతుబజార్లో వ్యర్థాలను శుద్ధి చేస్తూ బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యర్థాలను పునర్వినియోగం చేస్తూ వంటగ్యాస్‌ను, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం, మిగిలిన వ్యర్థాలను జీవ ఎరువుగా తయారు చేయడం మంచి పరిణామమన్నారు. దీంతో రైతుబజార్లో ఉద్యోగులు, రైతులతో పాటు వినియోగదారులకు పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించడం జరుగుతుందన్నారు. దుర్వాసన లేని పరిశుభ్రమైన పరిసరాల ఏర్పాటుకు, భూగర్భ జలాలకు హానికరం కాకుండా ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మార్కెటింగ్ శాఖాధికారులు పాల్గొన్నారు.