కుత్బుల్లాపూర్, నవంబర్ 3 : ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దు..ఒకప్పుడు కుత్బుల్లాపూర్ ప్రాంతం ఎట్లుండే..ఇప్పుడు ఎలా అయిందో గమనించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్ అన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని ఆరున్నరవేల కోట్లతో అభివృద్ధి చేశామని, అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే అభివృద్ధి జరగదన్నారు.
నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ పరిధి.. గోదావరి హోమ్స్ టీఎన్ఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమం, కాలనీల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని, మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంపత్ మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్రాజ్, సుధాకర్‌గౌడ్, జ్ఞానేశ్వర్, సమ్మన్న, కుంట సిద్దిరాములు,నరేందర్‌రెడ్డి, సంపత్గౌడ్తో పాటు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.