అంబర్‌పేట : బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట ట్రాన్స్‌కో ఏడీఈ కార్యాలయం వద్ద చేపట్టిన అండర్ గ్రౌండ్ నాలా డ్రైనేజీ పనులను నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ అండర్ గ్రౌండ్ నాలా డ్రైనేజీ పైపులైన్ దెబ్బతిని డ్రైనేజీ నీరు రోడ్డు మీద పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్లోని గాయత్రి టవర్స్, వైభవన్నగర్, సీజన్స్ దవాఖాన లేన్లలో డ్రైనేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
మ్యాన్‌హోళ్లు పొంగడంతో కాలనీలన్నీ డ్రైనేజీ మయంగా తయారవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, శుక్రవారం ఆయన పనులు జరుగుతున్న బతుకమ్మకుంట వద్దకు వచ్చారు. పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతాలోపం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
బతుకమ్మకుంట ఏడీఈ కార్యాలయం వద్ద జరుగుతున్న డ్రైనేజీ మరమ్మతు పనులను బాగ్‌అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ బి. పద్మవెంకటరెడ్డి కూడా శుక్రవారం పరిశీలించారు. ఈ పనులు పూర్తైతే వైభవ్‌నగర్, గాయత్రినగర్, శాంతినగర్ ప్రాంతాల ప్రజలకు డ్రైనేజీ ఇబ్బందులు తప్పుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు చుక్క జగన్, మిర్యాల శ్రీనివాస్, విజయలక్ష్మి, యాదగిరి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.