అంబర్‌పేట, సెప్టెంబర్7: నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేసేందుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ బలోపేతానికి నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. నియోజకవర్గంలో కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్లు ఉన్నాయి.
ఈ డివిజన్ల పరిధిలో ముందుగా బస్తీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీల్లో పార్టీకోసం కష్టపడిన, కష్టపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారితో పాటు ప్రారంభం నుంచి పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు, నాయకులతో బస్తీ కమిటీలు ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యే వెంకటేశ్ ఇప్పటికే సూచనలు ఇచ్చారు.
బస్తీ కమిటీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారు 50 శాతం మంది కమిటీలో ఉండేలా చూడాలని, బస్తీలో జనాభా ఎక్కువగా ఉంటే కమిటీలో సభ్యులను 15 నుం చి 25 మంది వరకు పెంచుకోవచ్చని పార్టీ అధిష్ఠానం సూచించింది. ఆ మేరకు చర్యలు ప్రారంభిస్తున్నారు.