అంబర్‌పేట, ఆగస్టు 23 : వందశాతం మందికి టీకాలు ఇప్పించేందుకు జీహెచ్ఎంసీ చేపట్టిన ఇంటి వద్దకే టీకాలు కార్యక్రమం అంబర్‌పేట సర్కిల్లో సోమవారం ప్రారంభమైంది. సర్కిల్ పరిధిలోని ఆరు డివిజన్లు హిమాయత్‌నగర్, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్అంబర్పేటలలో ఒక్కో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది టీకాలను వేశారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ మల్లికార్జుననగర్ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ బి. పద్మావెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సందర్శించారు. అక్కడ నుంచి ఆయన బస్తీలో ప్రతి ఇంటి వద్దకు ఆశావర్కర్లతో కలిసి వెళ్లి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని చెప్పారు. వారు చేపట్టిన సర్వేలో పాల్గొన్నారు. ఇంకా ఎవరైనా టీకా వేసుకోకుండా ఉంటే మొబైల్ కేంద్రం దగ్గరకు వచ్చి టీకా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సి న్ వేయించుకోవడం పట్ల నిర్లక్ష్యం వహించరాదని, అలాగే కరోనా నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నల్లకుంట డివిజన్ సత్యానగర్‌లో డివిజన్ కార్పొరేటర్ వై.అమృత మొబైల్ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. అంబర్‌పేట డివిజన్లో కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్, గోల్నాకలో కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ ప్రాంరభించారు.