అంబర్‌పేట, ఆగస్టు 10: కాచిగూడ ఆర్టీసీ క్వార్టర్ల నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు రైల్వేశాఖ పరిధిలో ఉన్నందునే రోడ్డును అభివృద్ధి చేయలేకపోతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రోడ్డు అధ్వాన స్థితికి చేరి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వే వంతెన పక్కన మరో కెంట్ నిర్మాణం చేపడితేగానీ ఇక్కడ రాకపోకల సమస్య తీరదన్నారు. రోడ్డు అధ్వానంగా మారి వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రైల్వేఅండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీ క్వార్టర్ల నుంచి కాచిగూడ స్టేషన్‌కు షార్ట్‌కట్‌లో వెళ్లేందుకు ప్రజ లు, వాహనదారులు ఈ రైల్వే అండర్ బ్రిడ్జి(కెంట్)ని వినియోగిస్తున్నారని అన్నారు. అయితే అటు, ఇటు రెం డు వైపుల నుంచి వాహనాలు వచ్చినప్పుడు ఈ కెంట్ ద్వారా వెళ్లాలంటే ఒకవైపు వాహనాలు ఆగాల్సిందేనని, అవి వెళ్లిన తరువాత మరోవైపు వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ సమస్య తీరాలంటే పక్కనే మరో కెంట్ నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు.
ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్ మాల్యా దృష్టికి కూడా తీసుకెళ్లామని, ఇంత వరకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రైల్వేశాఖనే ఈ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి అనుమతి ఇస్తే రూ.40లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశామన్నారు. ఈ విషయమై రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరా రు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈలు ఫరీద్, ప్రేరణ పాల్గొన్నారు.