అంబర్‌పేట, ఆగస్టు 7 : బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంట నుంచి ఛే నంబర్ మీదుగా గోల్నాక గంగానగర్ కాలాబ్రిడ్జి వరకు ఉన్న వరదనీటి నాలాను రూ.10 కోట్లతో విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. నాలా విస్తరణ పనులను ఏ విధంగా చేపట్టాలనే విషయమై శనివారం ట్రాఫిక్ పోలీసులు, జలమండలి, ట్రాన్స్‌కో, ఎస్ఎన్డీపీ అధికారులతో ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయం లో చర్చించారు. పనులు చేపడుతున్న సమయం లో ఏర్పడే ట్రాఫిక్ సమస్యను ఏవిధంగా అధిగమించవచ్చో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లతో మాట్లాడారు. ఆ సమయం లో ట్రాఫిక్‌ను ఎలా మళ్లిస్తే బాగుంటుందని అడిగారు. అలాగే జలమండలికి సంబంధించిన పైపులైన్లు కింద ఉన్నందున ఈ నాలా విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడుతుందని, వాటిని షిప్ట్ చేయాలని జలమండలి అధికారులకు చెప్పారు. అయితే షిఫ్టింగ్‌కు కావాల్సిన నిధులను ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్) అధికారులు జలమండలికి చెల్లిస్తే వారు మంచినీటి, డ్రైనేజీ పైపులను వెంటనే వేరేచోటుకు తరలిస్తారని చెప్పారు. ట్రాన్స్‌కోకు సంబంధించిన వైర్లను కూడా వేరే చోటుకు మార్చాలని చెప్పారు. ఈ నిర్మాణం పూర్తయితే వానకాలంలో వరద ముంపు సమస్య తప్పుతుందని చెప్పారు. త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ఈ సమావేశంలో జలమండలి డీజీఎం సతీశ్, ఏడీఈ గణేశ్ పాల్గొన్నారు.