భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 26: అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులతో కలిసి సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డికి అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, జిట్టా త్వరలో కోలుకుంటారని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నోముల పరమేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.