మన్సూరాబాద్, ఆగస్టు 18: వానకాలంలో కాలనీల్లో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి జడ్జెస్కాలనీ నుంచి హిమపురికాలనీ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బాక్స్‌టైప్ డ్రైనేజీ ట్రంకులైన్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరింపజేస్తున్నామని తెలిపారు. వానకాలంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో లోతట్టు ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కాలనీల్లో చేపడుతున్న బాక్స్‌టైప్ డ్రైనేజీ ట్రంకులైన్ పనులకు ప్రజలు సహకరించి పనులు వేగవంతంగా జరిగేందుకు తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు రుద్ర యాదగిరి, పారంద నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.