మన్సూరాబాద్, ఆగస్టు 12: నగరంలో ఎక్కడా లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆక్సిజన్ పార్కును ఎల్బీనగర్లోని కామినేని ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. 390 మీటర్ల స్థలంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ పార్కును సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యమయంగా మారుతున్న నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ ఐఐటీ గుర్తించిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఇరవై ఆరు రకాల 36 వేల మొక్కలను కామినేని ఫ్లైఓవర్ కింద నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. పచ్చదనం ఉట్టిపడేలా ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ పార్కు డిసెంబర్‌లోగా ప్రజలకు అందుబాటులోకి రా నుందని తెలిపారు. పార్కుకు వచ్చే వారు సేదతీరేందుకు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు మార్కింగ్ వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నాయకుడు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.