బంజారాహిల్స్,ఆగస్టు 31: 20 ఏండ్ల్ల క్రితం అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యాన్ని తలకెత్తుకున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 2న ఖైరతాబాద్ నియోజకవర్గంలో నిర్వహించతలపెట్టిన టీఆర్ఎస్ జెండా పండుగను విజయవంతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కార్యకర్తలను కోరారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దానం నాగేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటుతో పాటు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో తొలిసారిగా టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన నాటినుంచి అంచెలంచెలుగా ఎదిగిన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజధానిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండగను నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 2న జెండా పండగను ఖైరతాబాద్ నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రానున్న పదిరోజుల్లో టీఆర్ఎస్ బస్తీ కమిటీలు ఏర్పాటు చేస్తామని,పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంకోసం కృషి చేస్తామన్నారు.