బంజారాహిల్స్, ఆగస్టు 11: ఫిలింనగర్ 18 బస్తీలకు చెందిన ప్రజల అభీష్టం మేరకు రామానాయుడు స్టూడియోకు కింది భాగంలోని స్థలంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం ఫిలింనగర్లో రెడ్‌ఫోర్ట్ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని 100 ఫీట్ల రోడ్డు పక్కన నిర్మించేందుకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో ఉన్న ఆలయాన్ని తొలగించవద్దంటూ స్థానికులు కోరగా, నిర్మాణ సంస్థతో మాట్లాడి సుమారు 700 గజాల స్థలంలో ఆలయాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పించినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా వారే భరిస్తారని తెలిపారు. ఫిలింనగర్ 18 బస్తీల్లో ఎక్కడా లేని విధంగా ఆలయ నిర్మాణం ఉండే విధంగా, స్థానికుల అవసరాల కోసం కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేలా చూస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.